యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒకరు. అంతేకాకుండా టాలీవుడ్ నుండి పాన్ ఇండియాకు పరిచయమైన స్టార్స్ లోను ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీఆర్ చివరగా నటించిన రెండు సినిమాలు సైతం తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలయ్యాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు సైతం వచ్చింది. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన నటనతో బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులను ఫిదా చేశారు. దీంతో ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మరో పాన్ ఇండియా సినిమాలో నటించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

దేవరతో మరో పాన్ ఇండియా హిట్

2024 సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. అంతేకాకుండా బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ సైతం ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రంతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 420 నుండి 450 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బయ్యర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. మిగతా దక్షిణాది భాషల్లో మాత్రం వసూళ్లు సాధారణంగానే వచ్చాయి. అయితే ఇది దేవర పార్ట్ 1 కాగా పార్ట్ 2 కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారా?

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా డ్రాగన్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు. అయితే ఇంతలోనే ఎన్టీఆర్ నుండి మరో ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో అనిల్ రావిపూడి తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. సినిమాలకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే అనిల్ రావిపూడి చేసిన సినిమాలు అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ రిస్క్ రిస్క్ చేస్తున్నారా? అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు. టాలీవుడ్ లోని ఇతర స్టార్ హీరోలు అంతా పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ సినిమాల వైపు చూస్తే ఎన్టీఆర్ మాత్రం రీజనల్ సినిమాలో నటించేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారని అనుకుంటున్నారు.

ప్రభాస్ చేసిన రిస్కే ఎన్టీఆర్ కూడా

ప్రభాస్ కూడా బాహుబలి, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలతో మెప్పించిన తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే క్రైమ్ కామెడీ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పాన్ స్థాయిలో గుర్తింపు సంపాదించిన ప్రభాస్ ను రాజసాబ్ లాంటి సినిమాలో అభిమానులు చూడలేకపోయారు. ఈ సినిమా రాకముందే ప్రభాస్ అభిమానులు సైతం ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా? అని అనుకున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత అనుకున్నదే జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. టైర్- 2 హీరోలు సైతం ప్లాన్ స్థాయిలో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తి చూపిస్తుంటే.. ఎన్టీఆర్ మాత్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.