నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
నవంబర్ 13న దాదా ధమాకా
ఈ సినిమా నుంచి మొదటి పాటగా ‘దాదా ధమాకా’ అనే మాస్ సాంగ్‌ను నవంబర్ 13న విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైంది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్లో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కూడా కనిపించారు. ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో పాటపై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఈ పాటకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ పాటలోని కొన్ని లైన్స్‌ను స్వయంగా బాలకృష్ణ ఆలపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమన్ సంగీతంలో బాలయ్య గాత్రం వినిపించనుండటం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. అంతేకాకుండా ఈ పాటలో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ సందడి చేయనుండటం మరో విశేషం.
గతంలోనూ గాయకుడిగా బాలయ్య
బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా అప్పుడప్పుడు తన గాత్రంతోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా 2017లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్ లా’ అనే పాటను స్వయంగా ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాట అప్పట్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. బాలకృష్ణ మాస్ వాయిస్‌కు అనుగుణంగా రూపొందిన ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మరోసారి ఆయన తన గాత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో గతంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, శ్రుతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీరోజ్, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా విజయంతో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది.
భారీ తారాగణంతో దాదా
ఇక ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వస్తున్న ‘దాదా’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, నర్గీస్ ఫక్రీ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 13న విడుదల కానున్న ‘దాదా ధమాకా’ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది. మరి ఈసారి బాలకృష్ణ తన గాత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
మరోసారి వెండితెరపై అలరించనున్న బాలకృష్ణ – కాజల్ కెమిస్ట్రీ
బాలకృష్ణ – కాజల్ అగర్వాల్ కాంబోలో కొన్ని సంవత్సరాల క్రితం ‘భగవంత్ కేసరి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు దక్కాయి. మళ్ళీ దాదా సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తూ ఉండడంతో మరోసారి అదే స్థాయి కెమిస్ట్రీ వెండితెరపై వర్కౌట్ అవుతుందని బాలయ్య అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ జోడి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.



