హీరోలు కాస్త తేడాగా కనిపిస్తే అభిమానులు సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా ఆందోళన పడిపోతారు. జుట్టు ఊడినా, బరువు పెరిగినా తగ్గినా ముందుగా అభిమానులే ఆందోళన చెందుతారు. తాజాగా టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ అదే జరుగుతోంది. ఇటీవల మహేష్ బాబు చాలా సన్నబడ్డారు. సాధారణంగానే మహేష్ బాబు సన్నగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న ఫోటోలలో ఆయన మరింత సన్నబడి పేషంట్ లా కనిపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో… కొంచెం అన్నం తినండి అయ్యా? అంటూ మీమ్స్ సైతం దర్శనమిస్తున్నాయి. మహేష్ బాబుకు ఏమైంది? ఇంత సన్నగా ఎందుకు అయ్యారు? అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
ప్రస్తుతం రాజమౌళి సినిమాలో మహేష్ బాబు
అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నిర్మాణంలో రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా భాగస్వామిగా ఉన్నాడు. అయితే కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో లోనే ఇలా సన్నగా కనిపించడం చర్చకు దారి తీసింది. కార్తికేయ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలో గతంతో పోలిస్తే చాలా సన్నగా కనిపించాడు. అతడి చేతి పై ఉన్న నరాలు సైతం కనిపించేంత సన్నగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వారణాసి షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసమే కొత్త లుక్
ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం డైటింగ్ చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్ బాబు వారణాసి సినిమా తర్వాత పలువురు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సుకుమార్, లోకేష్ కనకరాజు, సందీప్ రెడ్డి వంగ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో మహేష్ బాబు తదుపరి సినిమా సందీప్ రెడ్డి వంగాతోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కితే ఈ సినిమా కోసమే మహేష్ బాబు తనను తాను మార్చుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సంగీప్ రెడ్డి వంగా సినిమాలు అంటే వయోలెన్స్ కనిపిస్తుంది. ఆయన చేసిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో చాలా సన్నగా స్టైలిష్ గా ఉంటాడు.
అంతేకాకుండా యానిమల్ సినిమాలో కూడా హీరో చాలా స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తాడు. కథలో భాగంగా కొన్ని సన్నివేశాల కోసం బరువు పెరిగినా ఆ తర్వాత మాత్రం సన్నగా చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు. దీంతో సందీప్ రెడ్డి సినిమా కోసమే మహేష్ బాబు ఇప్పుడు బరువు తగ్గారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సినిమా ప్రారంభమై ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే ఈ వార్తలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.



