టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత కొన్ని సినిమాల నుండి శ్రీ విష్ణు యూత్ కు కరెక్ట్ అయ్యే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు శ్రీ విష్ణు ఆంధ్రప్రదేశ్ అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ రాగా మొదట్లో వెబ్ డిజైనర్ గా పనిచేశారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ క్రమంలో అవకాశాలు రావడంతో షార్ట్ ఫిలిమ్స్, థియేటర్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

సోలో సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు

మొదటగా శ్రీ విష్ణు బాణం అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అయితే ఆ తర్వాత నటించిన సోలో సినిమాతో శ్రీ విష్ణుకు గుర్తింపు వచ్చింది. కెరీర్ మొదట్లో హీరోగా కాకుండా హీరో స్నేహితుడు, ఇతర పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో రాయల్ రాజు అనే పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్, ప్రతినిధి, అసుర, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఉన్నది ఒకటే జిందగీ, నీది నాది ఒకే కథ లాంటి సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు.

సామజవరగమనతో మంచి విజయం

శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. 2024 తర్వాత శ్రీ విష్ణు కెరీర్ మలుపు తిరిగింది. అతడు నటించిన ఓం భీమ్ బుష్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2025లో వచ్చిన సింగిల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుని అతడి ఖాతాలో మరో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ ఏడాది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీ విష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్, గాయపడ్డ సింహం, మృత్యుంజయ, విష్ణు విన్యాసం సినిమాలు ఈ ఏడాదే విడుదలయ్యాయి.

గతంలో విభిన్న పాత్రల్లో అలరించిన శ్రీవిష్ణు

అయితే గతంలో విభిన్న చిత్రాలలో నటించిన శ్రీ విష్ణు గత కొంతకాలంగా ఒకే రకమైన కామెడీ సినిమాలో చేయడం, తన సినిమాల్లో సోషల్ మీడియా మీమ్స్ కంటెంట్ వాడుకోవడం, కొన్ని సినిమాలపై సెటైర్లు వేయడం అభిమానులకు కోపం తెప్పిస్తోంది. గతంలో సింగిల్ సినిమాలో బాలకృష్ణ, మంచు విష్ణు కన్నప్ప రిఫరెన్స్ తీసుకుని చేసిన కొన్ని సన్నివేశాలపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీ విష్ణు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో చేశాడు.

రాబోయే ఫ్యామిలీ ప్యాక్ సినిమాలో చిరంజీవి సినిమాపై ట్రోలింగ్

ఇక ఇప్పుడు శ్రీ విష్ణు రాబోయే సినిమా పై సైతం విమర్శలు వస్తున్నాయి. శ్రీ విష్ణు ఫ్యామిలీ ప్యాక్ అనే సినిమాలో నటించాడు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ లో ఓ సన్నివేశంలో చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ట్రోలింగ్ చేసినట్టు సీన్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మెగాస్టార్ అభిమానులు శ్రీ విష్ణు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ విష్ణు ఇలా స్టార్ హీరోలను, మంచి సినిమాలను కూడా ట్రోల్ చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శ్రీ విష్ణు కాస్త తగ్గాలని, కేవలం ఒకే రకమైన సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని సూచిస్తున్నారు. గతంలో ఓ సినిమాలో శ్రీ విష్ణు క్రైస్తవులను కించపరిచేలా కొన్ని సన్నివేశాల్లో నటించారు. దీంతో క్రైస్తవ సంఘాలు సైతం ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీ విష్ణు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఇప్పుడు మరోసారి శ్రీ విష్ణు చిక్కుల్లో పడటంతో ఎలాంటి ప్రకటన చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.