తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే సాధారణంగా ఏడాది ముందు ఎన్నికల వేడి మొదలవుతుంది. కానీ రాష్ట్రంలో మాత్రం ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు కార్యాచరణను రూపొందిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఎలా వెళ్లాలి? అధికారంలోకి రావడానికి ఎలా కష్టపడాలి? ఎక్కడ ఎవరిని బరిలోకి దింపాలి? ప్రచారం జోరు ఎలా పెంచాలి? అనే అంశాలపైనే పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని నెలలుగా అనేక జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల జిల్లాలో రేవంత్ రెడ్డి సభలు ఏర్పాటు చేయడం, అక్కడి నేతలపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. అంతకుముందు కేటీఆర్ కు వ్యతిరేకంగా సిరిసిల్లలో సభ ఏర్పాటు చేశారు. త్వరలోనే గజ్వేల్ లోను సభను నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పాలనపైన ఆయన విమర్శలు కురిపించి మరోసారి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఈ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల కోసమే రేవంత్ ఈ సభలు నిర్వహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పదేపదే ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మళ్లీ తమదే అధికారం అని, మరో రెండేళ్లలో అధికారం చేపడతామని కూడా చెబుతున్నారు. ఇక

వరుస సభలు నిర్వహిస్తున్న బీఆర్ఎస

బీఆర్ఎస్ సైతం అదే దారిలో వెళుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మరో ఏడాది మాత్రమే ఉందని ఆ తర్వాత ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఇంటికి వెళుతుందని చెబుతున్నారు. ఇప్పటినుండే నాయకులను పార్టీలోకి ఆకర్షిస్తూ టికెట్ల కేటాయింపు పైన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో బీఆర్ఎస్ కు ఫలితాలు అనుకూలంగా రావడంతో జిల్లాల్లో ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలపై కేటీఆర్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ టార్గెట్ కూడా రాబోయే ఎన్నికల కోసమే అని స్పష్టంగా కనిపిస్తోంది.

బీజేపీ కూడా అదే బాటలో

ఇక బీజేపీ సైతం ఎక్కడా తగ్గడం లేదు. రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ సైతం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలు తరచు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జిల్లాలలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ దొందు దొందే అనే దానిని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకు వెళుతూ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరోవైపు అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించడం వెనక కారణం కూడా రాబోయే ఎన్నికల కోసమేనని తెలుస్తోంది.

2028లో జరగాల్సిన ఎన్నికలు

నిజానికి 2028 చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన డెలిమిటేషన్ కారణంగా 2029 ప్రారంభంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ రెండేళ్ల ముందే అన్ని పార్టీలు ఎన్నికలపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.