తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా కింది స్థాయి నుండి ఎదిగిన నేత. ఒక సాధారణ జడ్పిటిసి నుండి రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎం వరకు ఎదిగారు. ఇది మామూలు విషయం కాదు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మొదట జడ్పిటిసిగా చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై చట్ట సభలో అడుగు పెట్టారు. తెలుగుదేశం లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకుని తక్కువ కాలంలోనే చంద్రబాబుకు సన్నిహితుడుగా మారారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టిడిపి బలం తగ్గడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా పిసిసి పగ్గాలు అందుకున్నారు.
సీఎం అయ్యేవరకు పోరాడిన రేవంత్
బీఆర్ఎస్ పై విమర్శాస్త్రాలు ఎక్కు పెడుతూ సరైన కౌంటర్లు ఇస్తూ తక్కువ కాలంలోనే కాంగ్రెస్లో ఢిల్లీ పెద్దల ప్రశంసలు అందుకున్నారు. కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ పార్టీని నడిపించడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా రేవంత్ రెడ్డి అధిష్టించారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మూడేళ్లు పాలించి మరో పదేళ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అంతా సక్రమంగానే జరిగినా.
ఇప్పుడు పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాలన విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొందరు నేతలు తరచూ ఆయన పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు రేవంత్ రెడ్డికి సైతం మైనస్ అవుతోంది.
ఇప్పటికే వాళ్లపై వేటు వేసిన అధిష్టానం
గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సిఎం రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కొండా సురేఖ పై అధిష్టానం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్లో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసి పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లో చేరారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సైతం రేవంత్ రెడ్డి పై అసంతృప్తిగా ఉన్నారు. మరికొందరు నేతలు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి గా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ కు భారీగా నిధులు తీసుకువెళ్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి రేవంత్ రెడ్డి సైతం కౌంటర్లు ఇచ్చారు. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు.
నేతలను కంట్రోల్ లో పెట్టుకోవడంలో ఈ సీఎంలు సక్సెస్
అయితే గతంలో తెలంగాణ సీఎం గా పని చేసిన కేసీఆర్ పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అప్పట్లో సొంత ప్రభుత్వంపై ఒక ఎమ్మెల్యే, మంత్రి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మరోవైపు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు పై సైతం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాంటి విమర్శలు చేయలేదు.. చేయరు కూడా. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడం వల్ల ఈ సమస్య వచ్చింది అనుకున్నప్పటికీ.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ విమర్శలు చేసింది లేదు. అయితే ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నేతలను కంట్రోల్లో పెట్టుకోకపోతే వచ్చే 10 ఏళ్ళు ఏమో గానీ మళ్ళీ అధికారంలోకి రావడమే కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి రేవంత్ ఇప్పటికైనా నేతలను కంట్రోల్ చేయగలుగుతారో లేదో అనేది.



