మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి తాకిన ఎదురుదెబ్బల్లో అతిపెద్దది కేసీఆర్ కుమార్తె కవిత పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించడం. అంతేకాకుండా తండ్రి పార్టీ పైనే కవిత సంచలన ఆరోపణలు చేయడం కూడా బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఎదురవుతున్న సవాళ్లలో అతిపెద్ద సవాలుగా కవిత మారింది. సందర్భం వచ్చినప్పుడల్లా కవిత పార్టీపై కేటీఆర్, హరీష్ రావులపై విమర్శల వర్షం కురిపిస్తూ వార్తల్లో నిలిస్తున్నారు. ఏకంగా సిద్దిపేటలో హరీష్ రావును ఓడిస్తూ అంటూ కూడా ఛాలెంజ్ విసిరారు. ఇటీవల సిద్దిపేటలో సభ నిర్వహించి ఆయనపై విమర్శల వర్షం కురిపించారు.
మరోసారి కేసీఆర్ ,కేటీఆర్ పై సంచలన ఆరోపణలు
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కవిత వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2019లో తనకు క్యాన్సర్ ఉందని త్వరలోనే చనిపోతానని బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేయించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని చెప్పారు. కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచిన బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై అసభ్యకర వ్యాఖ్యలు.. నిరాధార ప్రచారాలు చేయించిందని చెప్పారు. తన గురించి తెలియని వ్యక్తులు ఇలాంటి ప్రచారం చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ తన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులే ఇలాంటి ప్రచారం ప్రచారం చేయించారని అన్నారు.
సోషల్ మీడియాలో వేధింపుల పై ఆవేదన
కేసీఆర్ కుమార్తెగా కేటీఆర్ సోదరిగా ఉన్న తననే అసభ్యకరంగా వేధించారని, వాల్ల మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. తనపై ఉన్న కోపంతో పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. తన దగ్గరికి వచ్చి మాట్లాడినా, తనతో ఫోటోలు దిగినా కార్యకర్తలను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి తన పట్ల ఇదే వివక్ష కొనసాగిందని చెప్పారు. నిజామాబాద్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించాలని కేసీఆర్ ను అనేకసార్లు కోరినా పట్టించుకోలేదని చెప్పారు. రైతులను తీసుకువెళ్లి షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అన్నారు. తన నియోజకవర్గానికి సంబంధించిన పనుల విషయంలో కూడా వివక్ష చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తన పేరుపై లేఖ పంపిస్తే లక్షల రూపాయల ఖర్చుతో వచ్చే సాయం కేవలం 60000 మాత్రమే ఇచ్చారని అన్నారు. కొన్ని విషయాలు చెప్పుకుంటే చిల్లరగా ఉంటాయని… కానీ చాలా బాధించాయని వెల్లడించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని, తను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఫోన్ టాప్ చేసినా అర్థం చేసుకోగలనని కానీ రాజకీయాలతో సంబంధం లేని తన భర్త ఫోన్ కూడా టాప్ చేశారని, అది తను చాలా బాధించిందని చెప్పారు. కేవలం కేసీఆర్ బిడ్డగా కాకుండా ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే తనను చూడాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు వ్యతిరేకంగా బతుకమ్మను ఎత్తుకొని ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు.
ఆ లాప్ టాప్ లో ఏం ఉంది?
లిక్కర్ స్కాం లో తన పేరు పై ఆరోపణలు వచ్చినప్పుడు ఉపయోగించిన 11 సెల్ ఫోన్లను కూడా తాను దర్యాప్తు సంస్థలకు ఇచ్చానని, దర్యాప్తులో తాను చాలా నిజాయితీగా ఉన్నానని అన్నారు. కానీ కేటీఆర్ లాప్టాప్ ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరినప్పుడు ఆయన ఎందుకు నిరాకరించాలని ప్రశ్నించారు. ఆ లాప్టాప్ లో ఏముంది అని అడిగారు. కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేటీఆర్ కవితను ఇంతలా టార్గెట్ చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కవిత తనకు క్యాన్సర్ వచ్చిందంటూ కేటీఆర్ ప్రచారం చేయించారని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.



