పంచాయతీ ఎన్నికలవేళ జనసేన కీలక ప్రకటన చేసింది. మంగళగిరి కార్యాలయం నుండి వెలుబడిన ఈ ప్రకటనలో గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలని ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఎలాంటి రాజకీయ పరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల్లో జనసేన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్టు పార్టీ వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కార్యకర్తలను, పార్టీ సైనికులను జనసేన నాయకులు అడ్డుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలు, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల తరహాలో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవని తెలిపింది. పార్టీ తరపున స్వేచ్ఛపూరితమైన వాతావరణం లో ఎన్నికలు జరగాలని స్పష్టం చేసింది.

పోటీ చేయాలనుకునే వారికోసం హెల్ప్ డెస్క్

అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారి కోసం జనసేన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఎవరికి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేలా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిశీలిస్తారని, పరిష్కరిస్తారని తెలిపింది. ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ దృష్టికి తీసుకురావాలని పార్టీ అధ్యక్షులు ఆదేశించినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక డెస్క్ కోసం జోన్లవారీగా మొత్తం ఐదు జోన్లకు గాను పరిశీలకులను కూడా నియమించింది. అయితే ఈ ప్రకటనలో జనసేన ఎలాంటి ఫోన్ నెంబర్లు, ఇతర అడ్రస్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అడ్రస్ లేకుండా ఫోన్ నెంబర్లు ఇవ్వకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా సంప్రదించాలి? అంటూ జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనసైనికులకు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ఉందని, పొత్తులు లేవని చేసిన ప్రకటనపై సైతం కార్యకర్తలు నాయకులు మండిపడుతున్నారు.

ఇప్పుడు చెబితే ఏం లాభం?

రాష్ట్రంలో ఇప్పటికే రెండు విడతల్లో పంచాయతీ నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడవ విడత నామేజినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 2 విడతల్లో కూడా ఇప్పటికే చాలా స్థానాలు ఏకగ్రీవం కూడా అయ్యాయి. ఇక ఇప్పుడు ప్రకటన చేస్తే ఏం లాభం అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రకటన పంచాయతీ ఎన్నికల ముందే చేసి ఉంటే మొదటి రెండు విడతల్లో కూడా జనసేన నుండి ఎక్కువ నామినేషన్లు వేసే వారని, బరిలో దిగేవారని చెబుతున్నారు. మొదటి రెండు విడతల్లో కూడా తమను స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. పొత్తుల పేరుతో చాలా స్థానాల్లో నామినేషన్లు వేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ప్రకటన చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అంటూ మండిపడుతున్నారు.

జనసేన కార్యకర్తలు, అభిమానుల ఆవేదన

మరోవైపు గ్రామాల్లో టిడిపి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు అంటూ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పులివెందులలో జనసేన సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి వేధింపుల వల్లే అతడు మరణించాడని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై విచారణ జరిపించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సైతం ఆదేశించారు. అయినప్పటికీ కార్యకర్తలు జన సైనికులు మాత్రం శాంతించడం లేదు. దీంతో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.