పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ దర్శకుడైనా ఎగిరి గంతేస్తారు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ అయ్యాక, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి కారణం ఇదే అంటూ అనేక వార్తలు కూడా వచ్చాయి. అయితే అసలు కారణం ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు ఆ డైరెక్టర్ నోటి నుండి రాలేదు. తాజాగా ఆయనే చెప్పడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. అసలు ఎవరు ఆ డైరెక్టర్? ఏంటి ఆ కథ? అనే వివరాలలోకి వెళితే…

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ప్రకటించిన పవన్ కళ్యాణ్

గబ్బర్ సింగ్ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా సంపత్ నంది పేరును సైతం ప్రకటించారు. అప్పటికే సంపత్ నంది రామ్ చరణ్ తో రచ్చ సినిమా తీశాడు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మరి కొన్ని సినిమాలు సైతం చేసి అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ గా సంపత్ నందిని ప్రకటించారు. కానీ సంపత్ నంది తప్పుకోవడంతో డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కించారు.

వివాదం వల్లే బయటకు వచ్చారంటూ టాక్

అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ తో గొడవల వల్లనే సంపత్ నంది ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. కానీ సంపత్ నంది మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంపత్ నంది ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. సంపత్ నంది ప్రస్తుతం శర్వానంద్ తో భోగి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మొదట సర్దార్ గబ్బర్ సింగ్ కథకు దర్శకుడిగా తననే కరారు చేసినట్టు చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ వరుస కమిట్మెంట్ల కారణంగా ఇతర కారణాలవల్ల షూటింగ్ ప్రారంభం అవ్వడం ఆలస్యమైందని చెప్పాడు. ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితిలో కనిపించడంతో పవన్ కళ్యాణ్ తనను పిలిపించి మాట్లాడినట్టు తెలిపారు. సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పట్టేలా ఉందని, అప్పటివరకు వెయిట్ చేయగలవా? అడిగారని అన్నారు. అయితే గ్యాప్ లో తాను మరో సినిమా పూర్తి చేసుకుంటే ఏమైనా అభ్యంతరం ఉందా సార్ అని అడిగానని అన్నారు. దానికి ఆయన ఒప్పుకున్నారని తెలిపారు. కేవలం షూటింగ్ లేట్ అవ్వడం, విరామం తీసుకోకుండా మరో సినిమా చేసుకోవాలని ఒక కారణంతోనే సామరస్యంగా ఆ ప్రాజెక్ట్ నుండి తాను బయటకు వచ్చినట్టు చెప్పారు. కానీ వివాదం కారణంగా తాను బయటకు వచ్చినట్టు ప్రచారం జరిగిందని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఏ రీమేక్ సినిమాకు ఒప్పందం చేసుకోలేదని, ఒరిజినల్ కథతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తీసేందుకే ఒప్పుకున్నానని అన్నారు. ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చిన తర్వాత తనతో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తి చూపించారని నిర్మాతలు చెప్పిన తర్వాత తాను చాలా బాధపడ్డానని అన్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసిన కొద్ది రోజులు తన జీవితంలో మొదటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని చెప్పారు.

త్వరలో భోగితో ముందుకు వస్తోన్న సంపత్ నంది

ఇక త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో భోగి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ లో ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. డింపుల్ సైతం కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై సైతం అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా సంపత్ నందికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.