ట్రబుల్ షూటర్ హరీష్ రావు టార్గెట్ అయ్యారా? సిద్దిపేటలో జెండా ఎగరేసేందుకు, హరీష్ రావును ఓడించేందుకు ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోందని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. బీఆర్ఎస్లో కేసీఆర్ తరవాత మళ్లీ అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు హరీష్ రావు. కేటీఆర్కు సైతం మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్నప్పటికీ ఆయనకు హైదరాబాద్ రంగారెడ్డిలాంటి ప్రాంతాల్లో ఎక్కువ పట్టుంటే హరీష్ రావుకు రాష్ట్రంలోని జిల్లాల్లో ముఖ్యంగా పల్లెల్లో సైతం పట్టు ఉంది. ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేరుగా జనాల్లోకి వెళ్లడంతో హరీష్ రావుకు అభిమానులు ఎక్కువే.
గత ప్రభుత్వంలో ఉప ఎన్నిక వస్తే గెలిపించింది హరీష్ రావే
అందువల్లే గత ప్రభుత్వంలో ఎక్కడ ఉపఎన్నిక వచ్చినా అక్కడ ప్రచారం కోసం హరీష్ రావు వాలిపోయేవారు. అక్కడ గెలుపునకు ఆయన కృషి చేసేవారు. పలు ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిపించడం వల్లే ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరు కూడా వచ్చింది. అలాంటి నేతనే ఓడిస్తానని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, టీఆర్ఎస్ అధినేత్రి కవిత సైతం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సిద్దిపేట గడ్డ కేసీఆర్, హరీష్ రావు అడ్డా
సిద్ధిపేటలో 1985 నుండి నేటి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అక్కడ దాదాపు 40ఏళ్లుగా వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హరీష్ రావు సిద్దిపేట నుండి వరసుగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తాచాటారు. దీంతో ఓటమి ఎరగని నేతగా హరీష్ రావు నిలిచారు. అలాంటి నేతను ఢీకొట్టేందుకు ఇప్పుడు కాంగ్రెస్, అటు కవిత సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుండే సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేటలో సభలు నిర్వహిస్తు, జిల్లాలో పర్యటిస్తూ అక్కడి నేతలు, కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. సిద్ధిపేటకు కొండగల్ కు సమానంగా నిధులు కేటాయిస్తానని అభివృద్ధి చేస్తానని హామీలు ఇస్తున్నారు. అక్కడితో ఆగకుండా సిద్ధిపేటలో కాంగ్రెస్ గెలిస్తే అభ్యర్థికి మంత్రిపదవి సైతం ఇస్తానని ఆఫర్ చేశారు. ఇక కేసీఆర్ కుమార్తె, కవిత పార్టీ మారిన నాటి నుండి హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు దోచుకున్నారని, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. సిద్దిపేట తమదేనని అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ సైతం సిద్దిపేటపైనే ఫోకస్ పెట్టింది. ఆ జిల్లాలో జేపీ నడ్డా పర్యటన జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. సిద్దిపేటలో ఓ వర్గం ఓట్లు హరీష్ రావుకు అనుకూలంగా లేవని, కాబట్టి ఆ ఓట్లను ఆకర్షించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇక్కడ రఘునందన్ రావును బరిలో దింపే ప్లాన్ లో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. రఘునందన్ రావు కూడా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న లీడర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయనకు మంచి పట్టు ఉంది. కాబట్టి ఆయనను బరిలో దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్, కవితతో పాటు బీజేపీ సైతం దాడి
ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఇంకోవైపు నుండి కవిత పార్టీ.. ఇలా ముప్పేట దాడి జరిగితే హరీష్ రావు తట్టుకుంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజా పరిణమాలన్నీ చూస్తే ఈ సారి ట్రబుష్ షూటర్కు ట్రబుల్స్ తప్పవని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక హరీష్ రావు మాత్రం అవేవీ పట్టనట్టుగా తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇస్తూ ఇతర ప్రాంతాల కంటే సొంతగడ్డపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ తాను చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల దాడిని హరీష్ రావు ఎలా తట్టుకుంటారు? ఏడుసార్లు గెలిచిన ట్రబుల్ షూటర్ ఎలాంటి ఎత్తులు వేస్తారు? అన్నది ముందు ముందు చూడాలి.



