గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న పలువురు హీరోలకు 2026 మంచి విజయాలను అందించింది. కొందరు తమ గత చిత్రాల ఫలితాలను అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగా, మరికొందరు విజయాల బాటలోకి తిరిగి వచ్చారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు వరుణ్ తేజ్, రవితేజ వంటి హీరోల సినిమాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీరితో పాటు మరికొందరు నటులు కూడా విజయాలతో వార్తల్లో నిలిచారు. దీంతో 2026ను టాలీవుడ్‌కు కంబ్యాక్ ఇయర్‌గా అభివర్ణించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి.. సంక్రాంతి విజయంతో జోరు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ముందు చిరంజీవి నుండి వచ్చిన భోళా శంకర్ ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీనితో మెగా అభిమానులు ఈ సినిమా రిజల్ట్ తో చాలా నిరుత్సాహపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ విజయం చిరంజీవికి ప్రత్యేకంగా నిలిచింది. మరోసారి తనకున్న ప్రేక్షకాదరణను నిరూపించుకోవడంతో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మంచి ఊపునిచ్చారు.

రామ్ చరణ్.. ‘పెద్ది’తో మరోసారి సత్తా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా ఈ ఏడాది కీలకంగా నిలిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించి విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అలా ‘గేమ్ ఛేంజర్’ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత బచ్చన హిట్ కావడంతో రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా ప్రత్యేక ఆనందాన్ని అందించింది. తన తదుపరి చిత్రాలతోనూ ఇదే విజయ పరంపరను కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన తదుపరి మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో చేయనున్నారు.

వరుణ్ తేజ్.. విజయాల బాటలోకి తిరిగి!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. ‘గని’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ వంటి సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయితే ఈ ఏడాది విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ఆయన తిరిగి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం సాధించిన ఆదరణ వరుణ్ తేజ్ కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన విజయం కావడంతో ఆయన కంబ్యాక్ జాబితాలో ఈ సినిమా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

రవితేజ.. ‘ఇరుముడి’తో మంచి ఊపు!

మాస్ మహారాజా రవితేజకు కూడా ఈ ఏడాది సానుకూలంగా మారింది. గత చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోకపోవడంతో ఆయన అభిమానులు మంచి హిట్ కోసం ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో విడుదలైన ‘ఇరుముడి’ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని రవితేజకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కొత్త కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది.

లెనిన్ మూవీ తో అఖిల్ జోరు!

అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ కూడా ఈ ఏడాది విజయవంతమైన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. అఖిల్ హీరోగా కెరియర్ను ప్రారంభించి చాలా కాలం అవుతుంది. కానీ ఆయనకు భారీ స్థాయి విజయాలు దక్కలేదు. అలాంటి సమయంలో వచ్చిన లెనిన్ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాతో ఈయన కెరియర్ టర్న్ అయ్యిందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

టాలీవుడ్‌కు కొత్త ఉత్సాహం!

ఒకప్పుడు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోలు విజయాల బాటలోకి రావడం పరిశ్రమకు సానుకూల పరిణామం. పెద్ద హీరోల సినిమాలతో పాటు యువ కథానాయకుల చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం బాక్సాఫీస్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. మొత్తంగా చూస్తే, పలువురు హీరోలకు విజయాలను అందించిన 2026 టాలీవుడ్‌కు గుర్తుండిపోయే సంవత్సరంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.