సినిమా ప్రమోషన్స్ అనేవి ఆ సినిమా గురించి ప్రజలకు తెలిసేలా చేస్తాయి. కానీ టికెట్లు తెగడం అనేది ఆ సినిమాలో నటించిన హీరో, ఫస్ట్ డే వచ్చిన టాక్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రమోషన్లు చేసినా చేయకపోయినా సినిమాకు మంచి టాక్ వస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ గా టికెట్లు తెగుతుంటాయి. లేదంటే ఎంత ప్రయత్నించినా వృథానే.. ఈవారం థియేటర్లలో విడుదలైన సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ వారం థియేటర్ లలో విడుదలైన పలు సినిమాలకు ప్రమోషన్లు ఫుల్ గా చేశారు.

ప్రమోషన్స్ ఫుల్ కలెక్షన్స్ నిల్

కానీ ఆ చిత్రాలకు వచ్చిన కలెక్షన్లు మాత్రం నిల్ అనే చెప్పాలి. భారీ ప్రమోషన్లు చేసినా ఎంతో శ్రమపడినా మొదటి రోజు ఓపెనింగ్స్ చూశాక నిర్మాతలకు నిరాశనే మిగిలింది. ఇక ఈవారం విడుదలైన సినిమాల్లో కొత్త కుర్రాడు అనీష్ రెడ్డి హీరోగా మనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఇట్లు అర్జున సినిమా కూడా ఒకటి. అక్కినేని నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమాకు స్టార్ హీరోలు సైతం ప్రమోషన్స్ చేశారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది. కానీ మొదటి రోజు మాత్రం కలెక్షన్స్ నిల్ గానే ఉన్నాయి. మరోవైపు లిటిల్ హార్ట్స్ సినిమా ఫేమ్ మౌలి ప్రధాన పాత్రలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డీఎన్ఏ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటితోపాటు చంద్రయాన్ అనే మరో సైన్స్ ఫిక్షన్ కామెడీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటితోపాటు డిఫరెంట్ ఎంటర్టైనర్ గా ప్రచారం చేసిన మాయలేడి కూడా ఈ వారం విడుదల అయింది.

సుడిగాలి సుధీర్ సినిమా కూడా

ఈ సినిమాలే కాకుండా సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన మాస్ ఎంటర్టైనర్ సినిమా గోట్ కూడా ఈ వారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్ని సినిమాలు విడుదలైనప్పటికీ అన్ని సినిమాలకు కూడా ఆశించిన మేర కలెక్షన్లు రాలేదు.

సీన్, రామాయణ కు భారీ కలెక్షన్స్

కానీ ఇప్పటికే విడుదలై వారానికి పైగా అవుతున్న సూర్య హీరోగా నటించిన సీన్ సినిమా, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన రామాయణ సినిమాలకు మాత్రం వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ రెండు సినిమాలకు గతంలో ప్రమోషన్స్ నిర్వహించినప్పటికీ విడుదలైన తర్వాత మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ పాజిటివ్ టాక్ రావడంతో సినిమాలకు జనాలు క్యూ కడుతున్నారు. కొన్ని థియేటర్లలో అయితే ఈ చిత్రాలకు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ సినిమాల విజయానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.

సీన్ , రామాయణ విజయానికి కారణం ఏంటి?

రెండు సినిమాలు కూడా స్టార్ హీరోలు నటించినవే. ఇక ఈ వారం వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా చిన్న హీరోలవే కావడం కూడా కలెక్షన్ లు తక్కువ రావడానికి కారణం అని చెప్పవచ్చు. మరోవైపు ఒకే వారం ఎక్కువ సినిమాలు థియేటర్లలో ఉండడంతో ప్రేక్షకులు సైతం ఏ సినిమాకు వెళ్లాలి? ఏ సినిమాకు వెళ్లకూడదు? అని కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సూపర్ అందుకున్న సీన్ మరియు రామాయణ సినిమాల వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ వారం విడుదలైన చిన్న సినిమాలలో కూడా కొన్ని సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మరి ముందు ముందు అయినా కలెక్షన్లు పెరుగుతాయా లేదా చూడాలి.