సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా, తాజాగా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో రూ.290 కోట్ల బిజినెస్!

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘వారణాసి’ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా రూ.290 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ కోసం పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీపడినప్పటికీ చివరకు మైత్రి సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డీల్ నిజమైతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ చరిత్రలో ఇదొక సరికొత్త రికార్డుగా నిలవనుంది.

ఆర్ఆర్ఆర్ రికార్డుకు మించి వారణాసి!

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు సుమారు రూ.225 కోట్లకు అమ్ముడయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు అదే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డును అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్ఆర్ఆర్ హక్కులు రూ.225 కోట్లకు అమ్ముడవగా, వారణాసి హక్కులు రూ.290 కోట్లకు చేరినట్లు వస్తున్న వార్తలను పరిశీలిస్తే ఈ రెండు సినిమాల మధ్య దాదాపు రూ.65 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే ఆర్ఆర్ఆర్ కంటే వారణాసికి తెలుగు రాష్ట్రాల్లో మరింత భారీ స్థాయిలో బిజినెస్ క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.

భారీ తారాగణంతో వారణాసి

ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చేపడుతున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద భారీ టార్గెట్!

సాధారణంగా సినిమా థియేట్రికల్ హక్కులు ఎంత భారీ ధరకు అమ్ముడవుతాయో, డిస్ట్రిబ్యూటర్లపై అంతే స్థాయిలో వసూళ్ల ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.290 కోట్లకు తెలుగు రాష్ట్రాల హక్కులు అమ్ముడైనట్లు వస్తున్న వార్త నిజమైతే, వారణాసి బాక్సాఫీస్ వద్ద భారీ లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాల ప్రకారం బ్రేక్ ఈవెన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరం కావచ్చని తెలుస్తోంది.

మొత్తానికి మహేష్ బాబు స్టార్‌డమ్‌కు రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడవడంతో వారణాసి విడుదలకు ముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమా కావడం, ఇప్పటికే వారణాసి నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్‌ తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన వసూళ్ల రికార్డును వారణాసి అధిగమిస్తోందా? లేదా? అనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుంది అనేది తెలియాలి అంటే ఇంకా చాలాకాలం వెయిట్ చేయాల్సింది.