తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. కొందరు నేతలు బహిరంగంగా పార్టీని విమర్శిస్తున్నారు. ఇప్పటికే కొందరిపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకున్నప్పటికీ సొంత పార్టీలోనే విమర్శలు తగ్గడం లేదు. కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కొండా సురేఖ పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలతో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పించారు. ఈ పరిణామం రాష్ట్ర కాంగ్రెస్లో సంచలనగా మారింది. ఇది జరిగి కొద్ది రోజులు అవుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మరికొందరు సైతం అసంతృప్తి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా సొంత ప్రభుత్వం పైనే విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిధుల విషయంలో అనిరుద్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆసక్తికరంగా మారాయి.

ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి

మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తన అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించారు. ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేయడంతోనే పార్టీ మారినట్టు చెప్పారు. పలు సందర్భాల్లో మంత్రి పదవి కోసం తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లి పెద్ద నేతలను సైతం కలిశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక కొద్ది రోజుల క్రితం నుండి ఆయన మంత్రి పదవి గురించి మాట్లాడటం లేదు …కానీ తన నియోజకవర్గంలో నిధుల కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు వేల కోట్లు తీసుకువెళుతున్నారని మంత్రి బట్టి విక్రమార్క మధిర అభివృద్ధికి వేలకోట్ల నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి కావలసిన నిధులను తీసుకువెళుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే కాదని రాష్ట్రం మొత్తం అని వ్యాఖ్యానించారు.

రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై cm ఫైర్

ఈ వ్యాఖ్యల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా సిద్దిపేట సభలో స్పందించారు. తమ పార్టీలో కొందరు నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారిని పిచ్చి కుక్క కరిచినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డకు తీసుకువెళ్తారని అన్నారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తున్నట్టు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా?

దీంతో రాజగోపాల్ రెడ్డి పై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారా? లేదంటే కొత్త పార్టీ పెడతారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో గుర్తింపు ఉన్న నేతల్లో ఒకరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తన నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించేందుకు కూడా ఆయన కృషి చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. కాబట్టి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయన తిరిగి బిజెపిలో చేరుతానని ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో ఆయన బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి కూడా కొంత బలంగానే ఉంది. కాబట్టి తిరిగి అదే పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఊహాగానాలు విడిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత ఆయన ఏం చేస్తారో చూడాలి.