సాధారణంగా సీక్వెల్స్ తీసేటప్పుడు హీరోలు లేదా దర్శకులు మారుతుంటారు. కానీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కి భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా సీక్వెల్ కు హీరో, దర్శకుడు ఇద్దరు మారిపోయారు. అంతేకాకుండా దర్శకుడు ఒక సీక్వెల్ ప్రకటించగా, నిర్మాతలు మరో సీక్వెల్ ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా నిర్మాతలు ప్రకటించిన సీక్వెల్ తో ఇప్పుడు ఆ వివాదం చర్చకు దారితీస్తోంది. ఈ రెండు సినిమాలలో ఏది పట్టాలు ఎక్కుతుంది? ఏది ఆగిపోతుంది? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ హనుమాన్ సీక్వెల్లో హీరో డైరెక్టర్ ఎందుకు మారారు? ఆ తర్వాత నిర్మాతలు కొత్త హీరోను, దర్శకుడిని ఎందుకు ప్రకటించారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం…

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజతో కలిసి నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో బ్యానర్ పై హనుమాన్ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అమృత ఇయర్ హీరోయిన్ గా నటించగా. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్ కీలకపాత్రలలో నటించారు. 2024 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా హనుమాన్ 2 ఉంటుందని అప్పుడే మేకర్స్ ప్రకటించారు. హీరోకు హనుమంతుడి శక్తులు లభించడం …సినిమా చివరిలో హీరో కోసం హనుమంతుడే నేరుగా వచ్చి పోరాడడం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా విజయంతో సీక్వెల్ ఫై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

హనుమాన్ 2 ప్రకటనతో అంతా షాక్

కానీ హనుమాన్ సీక్వెల్ ప్రకటించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవల హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా హనుమాన్ 2 నిర్మిస్తున్నట్టు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రకటించింది. కానీ సినిమాలో హీరోగా వైష్ణవ్ తేజ్, దర్శకుడిగా వీఐ ఆనంద్ పేర్లను ప్రకటించారు. అయితే నిజానికి హనుమాన్ సిరీస్ ఐపీ రైట్స్ మొదటి నుండి దర్శకుడు ప్రశాంత్ వర్మ దగ్గర ఉన్నాయి. రైట్స్ లేకుండానే నిరంజన్ రెడ్డి సీక్వెల్ ఎలా ప్రకటించారు? అన్నది ఇప్పుడు చర్చకు దారి తీసింది. నిజానికి హనుమాన్ విడుదలైన తర్వాత హీరో తేజ దర్శకుడు ప్రశాంత్ వర్మ లతో నిర్మాత నిరంజన్ రెడ్డికి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తేజ వేరే సినిమాలపై దృష్టి పెట్టగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రిషబ్ శెట్టి హీరోగా ప్రకటించారు.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్ వర్మ సీక్వెల్ ప్రకటించడంతో నిరంజన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తర్వాత ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ తీసుకుని వేరే బ్యానర్లో సినిమా చేయడానికి వీలు లేదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ప్రశాంత్ వర్మ ఆ మొత్తం తన పాత బకాయిల్లో భాగమేనని తెలిపారు. కొత్త సినిమా అడ్వాన్స్ కాదని స్పష్టం చేశారు. జై హనుమాన్ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ నిరంజన్ రెడ్డికి 23 కోట్లు చెల్లించి ప్రశాంత్ వర్మ ప్రైమ్ టైమ్ బ్యానర్స్ తో ఒప్పందం చేసుకున్న ఆక్టోపస్ సినిమా ను కూడా టేకోవర్ చేసుకునేలా ఒప్పందం చేసుకుంది.

ఈ ఒప్పందంతో హనుమాన్ సిరీస్ కు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకూడదు. కానీ ఇప్పుడు వైష్ణవి తేజ్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో గతంలో హనుమాన్ ప్రాజెక్ట్ ను నిరంజన్ రెడ్డి ప్రకటించడం ఒక్కసారిగా సంచలనం రేపింది. ఈ వివాదంపై మళ్లీ మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ వర్మ కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. మరోవైపు ఈ వివాదం గురించి తెలిసిన వైష్ణవ్ తేజ్ ఈ ప్రాజెక్టుకు ఎలా ఒప్పుకున్నారు. అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతోంది. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన హనుమాన్ సీక్వెల్ మళ్లీ ఎలాంటి మలుపు తిరగబోతుందో అని అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో.