రాష్ట్రంలో ఇప్పటివరకు పచ్చగా ఉన్న అధికార కూటమిలో చిచ్చు రేగింది. స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగితోందని అంతా అనుకునే లోపే బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను రాజీనామా చేస్తానని తన అభిప్రాయాన్ని రేపు ప్రకటిస్తానని అన్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? అనే ఆసక్తి నెలకొంది. ఆదినారాయణ రెడ్డి మొదటినుండి కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బిజెపికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో పదవిని టిడిపికి చెందిన పుత్తా నరసింహారెడ్డికి కేటాయించడంతో ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అసంతృప్తిని మీడియా ముఖంగా బయటపెట్టారు.

తమ్ముడి కుమారుడి కోసం ఛైర్మెన్ పదవి అడిగిన ఆదినారాయణ రెడ్డి

కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆదినారాయణ రెడ్డి తన తమ్ముడి కుమారుడు రాకేష్ రెడ్డికి ఇప్పించాలని ప్రయత్నాలు జరిపారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి కుటుంబం నుండే ఇద్దరు జడ్పిటీసీకి పోటీ చేసి గెలిచారు. అయితే చివరికి రాకేష్ రెడ్డికి పదవి కేటాయించకుండా టిడిపి నేత కొత్త నరసింహారెడ్డికి కేటాయించడంతోనే కూటమిలో చిచ్చు పెరిగింది. జడ్పీ చైర్మన్ పదవి బిజెపికి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ ప్రకటన

తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదని ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని అన్నారు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడం… మార్పులు చేసుకోవడం తనకు పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. తాను తలుచుకుంటే 20 నిమిషాల్లో రాజకీయ సమీకరణాలు అన్ని మారిపోతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను బిజెపి ఎమ్మెల్యే కాబట్టి సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? లేదా? అన్నది చూసిన తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు మంత్రి పదవులు ఇతర పదవులు అవసరం లేదని, ఎలాంటి ప్రత్యామ్నాయ పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై శివప్రకాష్ జీ కూడా తనతో మాట్లాడారని, తనకు బిజెపి మద్దతు ఉందని చెప్పారు. టిడిపి బిజెపి మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది పరిశీలించి రేపు ఉదయం ప్రకటన చేస్తానని వెల్లడించారు.

కడప జడ్పీ ఛైర్మన్ పదవి కోసం లాబీయింగ్ చేసింది ఎవరు?

కడప జిల్లా జడ్పీ చైర్మన్ పదవి టిడిపికి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో.. లాబీయింగ్ చేసిన నేత ఎవరో తనకు తెలియాలని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇక ఈరోజు రాత్రి ఆయన పలువురు నేతలతో ఇదే అంశంపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆదినారాయణ రెడ్డి రాజకీయ ప్రకటనపై కడప జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆదినారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అమరావతి లోని ఓ హోటల్లో ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య గంటపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ భేటీ తర్వాత ఆదినారాయణ రెడ్డి అలక వీడతారని అంతా భావించారు. కానీ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా నిర్ణయం రేపు ప్రకటిస్తానని… తన కుటుంబం నుండి జడ్పిటిసి బరిలో దిగిన ఇద్దరు రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

ఆదినారాయణ రెడ్డి ఎపిసోడ్ పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి తనకు ఎలాంటి ప్రత్యామ్నాయ పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాజీనామాకు కూడా వెనకాడబోనని క్లారిటీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు… ఆయనను ఎలా బుజ్జగిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కడప జిల్లా జడ్పీ చైర్మన్ పదవి కోసం లాబీయింగ్ చేసిన నేతలు ఎవరు? వారిపై ఏమైనా చర్యలు ఉంటాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కడప జిల్లాలో కూటమి విజయానికి ఆదినారాయణ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అన్న కుమారుడికి కాకుండా మరొకరికి పదవి ఇవ్వడం ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా జీవించుకోలేకపోతున్నారు. దీంతో ఆదినారాయణ రెడ్డి ఒకవేళ రాజునామా చేస్తే పరిస్థితి ఏంటి? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కూటమి ఎంతో సమన్వయంగా పనిచేస్తుంది. చిన్నచిన్న ఘటనలు చోటు చేసుకున్నా రాజీనామాలు చేసే స్థాయికి మాత్రం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తే కూటమి పరిస్థితి ఏంటి? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.